శ్రీకృష్ణుడు- బకాసురవధ ఎలా జరిగిందో మీకు తెలుసా?

దినము ఉదయమే గోపబాలకులు వారి లేగదూడలను అడవికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎండకు గురై విపరీతమైన దాహము కలుగగా, అలసిపోయిన వారి లేగదూడలను వారిలో వారు విభజించుకొని ఒక మంచినీటి కొలనులో వాటి చేత నీరు తాగించి వారు కూడా నీరు తాగి వస్తున్న సమయంలో ….


(బకాసురుడు కొంగ రూపం లో మాటువేసి ఉన్నాడు)

ఆ గోపకుమారులు ఆ దొంగకొంగ పొడవును నిర్ఘాంతపోయి చూస్తుండగా……


ఆ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్రచిత్తంతో అడవిలోని కొలనులో మునిలాగా నిలబడి ఉన్నది. ఇంక ఏ విధమైన కోరికలు లేవు ఒక్క కృష్ణుడి మీదనే దృష్టి అంతా కేంద్రీకరించింది. 

అలా నీటిలో మాటువేసి ఉన్నాడు ఆ బకాసురుడు.

ఆ టక్కరి కొంగ ఒక్కసారిగా కృష్ణునివైపు కుప్పించి దూకింది. ముక్కు విదిలించింది. రెక్కలు జల్లున విప్పి పాదాలు పైకెత్తి ఆకాశంలోకి ఎగిరింది. భయంకరంగా కూతపెడుతూ విజృంభించింది. దాని రెక్కల గాలికి అక్కడి చెట్లు విరిగి పడిపోయాయి. “సరే చూద్దాం” అని ఓర్పు వహించిన కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసిపెట్టి మ్రింగేశాడు.

అలా రాక్షసుడు మ్రింగిడంతో బలరాముడు మొదలైన గోపాలబాలకులు కృష్ణుడు కనిపించక, ప్రాణంలేని అవయవాలవలె అచేతనులై భయంతో కంపించిపోయారు.

అలా మ్రింగబడిన కృష్ణుడు ఆ రాకాసికొంగ గొంతుక దాటి లోపలికి పోలేదు. . . .

ఆ బకాసురుని కంఠం ముందు భాగమూ దౌడలూ కాలాగ్నివలె మండిస్తూ విజృంభించాడు కృష్ణుడు నిప్పుముద్దలాగ బకాసురుని కంఠానికి అడ్డుపడ్డాడు. అతడు విజయం సాధించే శీలంకలవాడు; బ్రహ్మదేవుడు అంతటివాడికి తండ్రి; అతడు మహా మహిమ గలిగినవాడు. అతడు మ్రింగుడుపడడం లేదని దీర్ఘంగా నిందిస్తూ, ఆ బకాసురుడు కృష్ణుణ్ణి మళ్లీ బయటకి వెళ్ళగ్రక్కాడు. అలా కృష్ణుడు బయటపడటం చూసి లోకం అంతా సంతోషించింది.

ఆవిధంగా బయటికి క్రక్కివేసిన కృష్ణుణ్ణి ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పొడిచి చంపేద్దామని భీకరంగా నోరు తెరచి ముందుకు దూకాడు. కలహానికి కాలు దువ్వే ఆ కొంగ ముక్కు రెండు భాగాలను కృష్ణుడు రెండు చేతులతో పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్లు నిలువునా చీల్చేసాడు. 

అలా బకాసురుని చంపగానే కృష్ణుడి మీద దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలు కురిపించారు. ఆకాశంలో దుందుభి ధ్వనులు వినిపించాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలుకూడా ఎలా సచేతనాలు అవుతాయో అలాగే బలరాముడు మొదలైన గోపకుమారులు అందరూ బ్రతికిపోయామని సంతోషించారు. “బ్రతికి వచ్చావా కృష్ణా!” అంటూ అతణ్ణి కౌగలించుకున్నారు. అందరూ కలసి మందలను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇండ్ల వద్దకు చేరుకున్నారు. బకాసురవధను గురించిన కధ అంతా వారు చెప్పగా గోకులంలోని గోపగోపికాజనాలు విని నివ్వెరపోయారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s