ప్రహ్లాదుని గుణ వర్ణన చదివితే భక్తుడు అంటే ఇలా ఉంటాడా అని అనిపిస్తుంది!- Baktha Prahlad Nature

 ఓ పరీక్షిత్తు మహారాజా! ఆ నలుగురిలో చక్కటి వివేకము కలిగిన వాడూ; సకల ప్రాణులను తనతో సమానులుగా చూచు వాడూ; సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరకెళ్ళి మ్రొక్కు వాడూ; పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొను వాడూ; దిక్కులేని వారిని చూస్తే వారిని సొంత బిడ్డలలా కాపాడు వాడూ; మిత్రులతో అన్నదమ్ములులా మెలగు వాడూ; దేవుళ్ళు అంటూ గురువులను భావించే వాడూ; ఆటలలో కూడా అబద్దాలు ఆడని వాడూ; చక్కటి మర్యాద గల వాడూ ప్రహ్లాదుడు అను కొడుకు.





ఇంకా ఆ ప్రహ్లాదుడు ఎల్లప్పుడు విష్ణువును తన చిత్తము నందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడు. గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా ఇంద్రియ లోలుడు కాడు. దివ్యమైన యౌవనమూ బలమూ అధికారములు అన్నీ ఉన్నా కామము, క్రోధము మొదలగు అరిషడ్వర్గానికి లొంగడు. స్త్రీలు మున్నగు చాపల్య భోగములెన్ని ఉన్నా ఆ వ్యసనాలలో తగులుకోడు. లోకంలో కనబడేవీ, వినబడేవీ అయిన వస్తువులను వేటినీ కావాలని వాంఛించడు.

నిర్మలమైన మనసు గల ధర్మరాజా! ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి.

  ఓ నరేంద్రా! రాక్షసకులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం, “ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు” అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇక మీలాంటి భాగవతోత్తములు అతనిని పొగడకుండా ఉంటారా?

  ఆ సుగుణాలగని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్ప నలవికాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించినా ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగువారు కూడ వర్ణించలేరు.

ఇలా గొప్ప సద్గుణాలు కల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజసిద్ధంగా భక్తితో భగవంతుడూ, ఆత్మలో వసించేవాడూ అయిన విష్ణుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరి భక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది.

 మహారాజా! ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను చెంది ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి తన ఎదురుగా మెదలుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు. హరిధ్యానముతో మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడై అన్ని వదిలేసి, మోహము లేకపోయినా, పిచ్చివాడి లాగ కనబడతాడు.

రాజా! ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు.

పరీక్షిన్మహారాజా! ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచిపోయి \”విష్ణుధ్యానములో విరామం కలిగిం\” దని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు; ఒక్కక్క చోట విష్ణువు మీద మనసు నిలిపి, ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు; ఒక్కోసారి \”విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదు లే\” దని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు; ఒక్కోచోట \”నలినాక్షుడు (విష్ణువు) అనే పెన్నిధి కన్నులారా కన్నా\” అంటూ గంతులేస్తాడు; ఇంకోచోట భక్తిపారవశ్యంతో ఆనందభాష్పాలు రాలుస్తూ \”పరమేశ్వరా! కేశవా!\” అని పిలుస్తూ ఉంటాడు; మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఒడలు గగుర్పొడుస్తుండగా కనులు మూసికొని నిర్లిప్తంగా ఉంటాడు.




Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s